ఒక్క కేసు లేదు, అయినా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి!

షిల్లాంగ్‌:  అగ్రరాజ్యంతో సహా ప్రపంచదేశాలన్నిటిని వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ తన ప్రభావాన్ని ఎక్కువగానే చూపుతుంది. ఈ నేపథ్యంలోనే కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భారత ప్రధాని నరేంద్రమోదీ 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించారు. కేంద్ర చర్యలతో పాటు వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండటానికి రాష్ట్రాలు కూడా గట్టి చర్యలే తీసుకుంటున్నాయి. 




ఇందులో భాగంగానే మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్‌ సంగ్మా షిల్లాంగ్‌ వీధుల్లోకి వచ్చి సామాజిక దూరం పాటించాలని ప్రజలను కోరారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించాలని, పోలసులకు సహకరించి వారు గీత గీసిన ప్రదేశాల్లోనే నిలబడాలని విజ్ఞప్తి చేశారు. మీ మంచికోసమే ఇదంతా చేస్తున్నామని వారికి అర్థమయ్యేలా వివరించారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదేవిధంగా ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రజలు పాటించేలా చూడాలి అని కూడా సంగ్మా పోలీసులను ఆదేశించారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు మేఘాలయాలో ఒక్క కరోనా పాజిటివ్‌కేసు కూడా నమోదు కాలేదు.